సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తిరుపతి జిల్లాలో నేడు, సోమవారం ఉదయం జరిగిన ఈ ప్రమాదంలో ఏడాది చిన్నారి పునీత్ సాయి, విద్యార్థిని యశ్వితలు మృతి చెందగా.. మరో 30మంది గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. తెల్లవారుజామున సమయంలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.పుల్లంపేట మండలం ఉడుంవారిపల్లి సమీపంలోని కడప – చెన్నై జాతీయ రహదారిపై లారీ, ఆర్టీసీ బస్సు ఒకదానికొకటి ఢీకున్నాయి. కడప డిపోకు చెందిన నాన్‌స్టాప్ ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు తిరుపతి వైపు నుంచి కపడకు వెళ్తోంది. ఈ క్రమంలో ఉడుంవారిపల్లి వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ వేగంగా వచ్చి బస్సును ఢీకొట్టింది. భారీ శబ్దం రావడంతో స్థానికులు వచ్చి చూడగా.. ప్రమాదానికి గురైన బస్సులో ప్రయాణికులు ఇరుక్కుపోవడాన్ని గమనించారు. పోలీసులకు సమాచారం ఇచ్చి బస్సు శిథిలాల కింద ఇరుక్కుపోయిన వారిని సురక్షితంగా బయటకు తీశారు.
