సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం పట్టణ శివారులోని తాడేరు గ్రామంలో ఇటీవల వరుస దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టడానికి పోలీసుల సూచన మేరకు వైసిపి నాయకులు నామన మహేష్, మట్టా ఏసులు సుమారు రెండు లక్షల ఖర్చుతో గ్రామంలో సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు. కాగా ఈ సీసీ కెమెరాలను నేడు, బుధవారం స్థానిక క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ వర్చువల్ విధానంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో జరుగుతున్న దొంగతనాల కారణంగా ప్రజలు నష్ట పోకుండా, ఈ దొంగతనాలను నివారించేందుకు తమ పార్టీ నాయకులు మహేష్, ఏసులు వారి సొంత డబ్బులతో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయడం అభినందనీయం అన్నారు. రూరల్ ఎస్సై అప్పలరాజు మాట్లాడుతూ దొంగతనాలను అరికట్టడంలో భాగంగా గ్రామాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.దాతలకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్, గ్రామ మాజీ సర్పంచ్ కోమటి రాంబాబు, వైసీపీ నాయకులు కొట్టి కుటుంబరావు, తిరుమాని ధనుంజయ, కర్రి పాపారాయుడు, నామన నాని తదితరులు పాల్గొన్నారు.
