సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ 12 సంవత్సరాల విజయవంతమైన పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్ 5 నుంచి 21 వరకు సాధించిన ప్రగతి, అభివృద్ధి కార్యక్రమాలు, ఆంధ్రప్రదేశ్ కు, కేంద్ర సహకారం ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ శ్రేణులకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పిలుపునిచ్చారు. భీమవరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో ముఖ్య నాయకుల ప్రత్యేక సమావేశం నిర్వహించారు. శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. ప్రధాని మోదీ సమర్థవంతమైన నాయకత్వంలో దేశం ఆర్థికంగా ఎంతో బలపడిందని, సమాజంలోని ప్రతి వర్గం అభివృద్ధి చెందేలా అనేక సంస్కరణలు తీసుకువచ్చారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తోందని అన్నారు, పేదరిక నిర్మూలన, ఉచిత బియ్యం పంపిణీ, బీమా పథకాలు, ఆయుష్మాన్ భారత్ వంటి విప్లవాత్మక పథకాల ద్వారా కోట్లాది మంది ప్రజలకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరిందని ఆయన స్పష్టం చేశారు. ఎన్డీఏ పాలనలో ఎక్స్ప్రెస్ హైవేలు, గ్రీన్ కారిడార్లు, రైల్వే అభివృద్ధి పనుల వల్ల దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరిగాయని పేర్కొన్నారు. . అలాగే, జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజలందరినీ భాగస్వామ్యం చేయనున్నట్లు తెలిపారు.ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,లక్ష్మీ ప్రసన్న, రాష్ట్ర కార్యదర్శి , భోగిరెడ్డి ఆదిలక్ష్మి, జిల్లా బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
