సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడడంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. గత రాత్రి కళింగపట్నానికి సమీపంలో తీవ్ర వాయుగుండం తీరం దాటింది. అయినప్పటికీ ఉత్తర ఆంధ్ర, గోదావరి జిల్లాల అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తూనే ఉన్న నేపథ్యంలో భీమవరం పట్టణంలో నేటి గురువారం రాత్రి మరింత విస్తారంగా కురుస్తున్న వర్షాల కు లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరి ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. అక్కడ నెలకొన్న పరిస్థితులను భీమవరం మున్సిపల్ కమిషనర్ కె. రామచంద్రారెడ్డి నేడు,గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా ప్రకాశ్‌నగర్, బీసీ కాలనీ, శంకరమఠం వీధి, చెన్నపేట, మెంట్ వారి తోట తదితర లోతట్టు ప్రాంతాల్లో పర్యటించి, వర్షపు నీటి నిల్వలు, డ్రైనేజీ వ్యవస్థ, పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. నీరు నిలిచే ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ కాలువల్లో నీటి ప్రవాహానికి ఆటంకం కలిగించే వ్యర్థాలను తొలగించాలని, అవసరమైన ప్రాంతాల్లో మోటార్లను వినియోగించి వర్షపు నీటిని త్వరితగతిన తొలగించాలని సూచించారు. ప్రజలు మ్యాన్‌హోళ్లు, డ్రైనేజీ కాలువల వద్ద అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. వర్షపు నీటిలో విద్యుత్ తీగలు, విద్యుత్ స్తంభాలను తాకరాదని సూచించారు.
