సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో నేడు గురువారం సాయంత్రం మేధావులు, విద్యావేత్తలు, వ్యాపారులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో మంత్రి ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. సర్ అంటే అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడంతో పాటు, మరణించినవారు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన వారి పేర్లను నిబంధనల ప్రకారం సరిచేయడం మాత్రమేనని కేంద్రమంత్రి వివరించారు. అర్హులైన ప్రతి భారత పౌరుడికి ఓటు హక్కును పరిరక్షిస్తామని స్పష్టం చేశారు. సర్ ప్రక్రియపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారం, అసత్య ఆరోపణలను తిప్పికొడుతూ ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్న 13 కోట్ల ఓట్ల తొలగింపు ఆరోపణల్లో వాస్తవాలను ప్రజలు గమనించాలని ఆయన అన్నారు SIR పై విద్యార్థులు, యువతకు కూడా అవగాహన కల్పించేందుకు త్వరలో వివిధ విద్యాసంస్థల్లో ప్రత్యేక సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు.రెండు చోట్ల ఓట్లు నమోదు చేసుకోవడం సరైన విధానం కాదని, అలాంటి అక్రమ నమోదులను సరిచేయడాన్ని ఓట్ల తొలగింపుగా చిత్రీకరించడం సరికాదన్నారు. ప్రత్యేకంగా రూపొందించిన ‘సర్’ ఫై అవగాహన బ్రోచర్‌ను కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ ఆవిష్కరించారు.
