సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేటి ఉదయం మన సిగ్మా న్యూస్ లో ‘కోలుకొని భీమవరం.. ప్రజలు ‘కర్మ’ చూస్తున్నారు “ ఘాటు వార్త కధనం రావడంతో భీమవరం మునిసిపల్ కమిషనర్ రామచంద్ర రెడ్డి మరింత అలర్ట్ అయ్యారు. నేడు, గురువారం భీమవరం పురపాలక సంఘ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ శ్రీ కె. రామచంద్రారెడ్డి ఎంహెచ్ఓ, శానిటరీ ఇన్స్పెక్టర్లు మరియు సంబంధిత మున్సిపల్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా భీమవరం పట్టణంలోని ముంపు ప్రాంతాల్లో తక్షణమే క్షేత్ర స్థాయిలో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, పనులు మరింత వేగవంతం చెయ్యాలని, అవసరం అయితే అదనపు సిబ్బందిని నియమించుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎక్కడ వర్షపు నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని, డ్రైనేజీలలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని వెంటనే తొలగించి నీరు సజావుగా ప్రవహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా దుర్వాసన వస్తున్నా ముంపు ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడంతో పాటు, దోమల నివారణకు యాంటీ లార్వా మందులు పిచికారీ చేయాలని, పట్టణంలోని రోడ్లు, వీధుల్లో పేరుకుపోయిన చెత్తకుప్పలను తక్షణమే తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఆదేశించారు.అంతే కాదు సమావేశం ముగిసాక మన సిగ్మా న్యూస్ లో పేర్కొన్న .దుర్గాపురం, బీఎంకే రైస్ మిల్, బ్యాంక్ కాలనీ, మెంటేవారి తోట, మిరమియా కోడు, పసిమొగ్గల పాఠశాల ప్రాంతాల్లో కమిషనర్ కె. రామచంద్రారెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి అక్కడి దారుణ పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత ఇంజనీరింగ్ మరియు పారిశుద్ధ్య సిబ్బందికి పలు ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు మోటార్లను ఏర్పాటు చేసి డీవాటరింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఇంజనీరింగ్ సిబ్బందిని ఆదేశించారు.
