సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు గురువారం భీమవరం లో పశ్చిమ గోదావరి జిల్లా సిపిఐ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శిగా కోనాల భీమారావు తో పాటు తొమ్మిది మంది జిల్లా కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అని ప్రకటించారు. కార్యవర్గ సభ్యులుగా కలిశెట్టి వెంకట్రావు, చెల్లబోయిన రంగారావు, ఎం.సీతారాంప్రసాద్, బొద్దాని నాగరాజు, సికిలే పుష్పకుమారి, నెక్కంటి క్రాంతి కుమార్, సనపల శ్రీనివాసరావు, మండల నాగేశ్వరరావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కోనాల భీమారావు మాట్లాడుతూ.. గత రెండు రోజులుగా తణుకులో జరిగిన సిపిఐ పశ్చిమగోదావరి జిల్లా 27వ మహాసభల తీర్మానాలప్రకారం.. జిల్లా సమగ్రాభివృద్ధికి, ప్రజా, కార్మిక, కర్షక, రైతు, కౌలు రైతు వంటి ప్రధాన సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపైనా వచ్చే మూడేళ్ల పాటు ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక రూపొందించామని, తెలిపారు. గతంలో ప్రతిపాదించిన ప్రకారం జిల్లా కలెక్టరేట్ ను భీమవరం మార్కెట్ యార్డు వద్దే నిర్మించాలని, మార్కట్ యార్డ్ కు జిల్లాలోని అన్నిప్రాంతాలతో కనెక్టివిటీ ఉందని, పి4 సాకుతో ఎక్కడికో తరలిస్తే సహించేదిలేదని ఆయన స్పష్టం చేశారు. అలాగే భీమవరం డంపింగ్ యార్డ్, యనమదుర్రు ప్రక్షాళన, భీమవరం ట్రాఫిక్, జిల్లాలోని డ్రైనేజీ, సాగునీటి వ్యవస్థల ప్రక్షాళనపై, ఆధునీకరణపైనా, కాలుష్యం నివారణకు ఉద్యమించనున్నామని ఆయన తెలిపారు. భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పాలకొల్లు మున్సిపాలిటీలకు తక్షణమే ఎన్నికలు జరపాలని దీనిపై ఉద్యమిసామన్నారు. భీమవరంలోని అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాల్ ను 1పునర్ నిర్మించాలని దీనిపైనా ఉద్యమిస్తామని ప్రకటించారు.
