సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని స్థానిక డి.యన్.ఆర్ కళాశాల ప్లాటినం జ్యూబ్లీ సెమినార్ హాలు లో నేటి సోమవారం వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్-2025 కార్యక్రమం ప్రిన్సిపాల్ జి.మోజెస్ అధ్యక్షతన నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ వికశిత్ భారత్ యూత్ పార్లమెంట్ – 2025 కార్యక్రమం ద్వారా ‘ఒక దేశం- ఒకే ఎన్నిక అనే విషయమై యువత అభిప్రాయాలు తెలుసుకునేందుకు వీలవుతుందన్నారు. ఒక దేశం ఒకే ఎన్నిక అనేది దేశ అభివృద్ధికి ఎంతో కీలకమని, మోడీ ప్రభుత్వం జమిలి ఎన్నికలకు ఆసక్తిగా ఉందని, లోక్ సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ఎన్నికల ఖర్చు, సమయం ఆదా అవుతుందని, ప్రపంచానికి భారతదేశాన్ని విశ్వ గురువుగా తీర్చిదిద్దేందుకై వికసిత్ 2047 లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ముందుకు వెళ్తున్నారని, దేశ భవిష్యత్తు నేటి యువత చేతిలోనే ఉందన్నారు.ఇక భీమవరం ఎమ్మెల్యే, పులపర్తి అంజిబాబు, స్థానిక ఎమ్మెల్సీ గోపిమూర్తి మాట్లాడుతూ.. వికసిత్ యూత్ పార్లమెంట్ ద్వారా యువత ముందుకు వచ్చి ప్రభుత్వానికి తగిన సూచనలు ఇవ్వాలని, జమిలి ఎన్నికలపై ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయానికి కేంద్రానికి తెలపాలన్నారు. కళాశాల పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు మాట్లాడుతూ.. జిల్లా స్ధాయి వికసిత్ భారత్ కార్యక్రమమునకు ఎంపికైన వివిధ కళాశాలకు చెందిన 150 మంది విధ్యార్ధులు రాష్ట్ర స్దాయి, జాతీయ స్ధాయికి వెళ్లి తద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి మీ అభిప్రాయాలను తెలియచేయవలసినదిగా కోరుకుంటున్నామని అన్నారు.ఉపాధ్యక్షులు పాండు రంగ రాజు, వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ ప్రత్యేక అధికారి డి.వై.ఓ డి. కిషోర్, జిల్లా యువజన సర్వీసులు సి.యి.ఓ ప్రభాకర్, ఆదికవి నన్నయ యూనివర్శిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వర రావు, కళాశాల పాలకవర్గ సభ్యులు పి.రామకృష్ణంరాజు, తదితరులు పాల్గొన్నారు.
