సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో జ్యేష్ఠ పౌర్ణమి, ఏరువాక పున్నమి సందర్భంగా నేడు, సోమవారం ఆధ్యాత్మిక శోభ నెలకొంది. వ్యవసాయానికి ఊపిరి పోసే ఆషాఢ మాస ప్రారంభాన్ని సూచించే ఈ పుణ్యదినాన్ని పురస్కరించుకుని దేవస్థానంలో చండీ హోమం, ధాన్యలక్ష్మి పూజ, సౌభాగ్యలక్ష్మి పూజలను అత్యంత వైభవంగా నిర్వహించారు.దేవస్థానం ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ, వేదపండితుల ఆధ్వర్యంలో జరిగిన చండీ హోమంలో 94 మంది దంపతులు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. అనంతరం రైతాంగ సంక్షేమం, సమృద్ధిగా వర్షాలు కురవడం, పాడిపంటలు సమృద్ధిగా పండడం, రాష్ట్ర ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, సుఖశాంతులు కలగాలని ప్రత్యేక సంకల్పాలతో ధాన్యలక్ష్మి పూజ నిర్వహించారు.అదేవిధంగా మహిళల సౌభాగ్యం, కుటుంబ శ్రేయస్సు కోసం సౌభాగ్యలక్ష్మి పూజలను విశేషంగా నిర్వహించారు. పూజల్లో పాల్గొన్న భక్తులకు అమ్మవారి దర్శనం అనంతరం ధాన్యం, పసుపు కొమ్మును ప్రసాదంగా అందజేసి ఆశీర్వదించారు.ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే, పీఏసీ చైర్మన్ అంజిబాబు, తీమణి సత్యవాణి, ధర్మకర్తల కమిటీ సభ్యులు హాజరు అయ్యారు.
