సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల బాపట్ల పరిసర ప్రాంతాల్లో రైళ్లను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న వరుస చోరీలు, పోలీసుల కాల్పుల ఉదంతం ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది.తాజగా భీమవరం తో పాటు గోదావరి జిల్లా వాసులు ఎక్కువ ప్రయాణాలు చేసే సర్కార్ ఎక్స్ ప్రెస్ రైలు లో జరిగిన చోరీ సంచలనం రేపింది. తమిళనాడులోని చెంగల్‌పట్టు నుంచి కాకినాడ పోర్ట్‌కు వెళుతున్న సర్కార్ ఎక్స్‌ప్రెస్ రైలులో గత సోమవారం తెల్లవారు జాము సుమారు 2గంటల సమయంలో దొంగలు బీభత్సం సృష్టించారు.మహిళలను బెదిరించి 7 సవర్ల బంగారం దొంగతనంచేసినట్లు సమాచారం. బాపట్ల శివారులోని నల్లమడ వాగు రైల్వే వంతెన సమీపంలో రైలు ప్రయాణిస్తుండగా, ఎస్-3, ఎస్-6 బోగీల్లో నిద్రిస్తున్న ఇద్దరు మహిళా ప్రయాణికుల నుంచి దుండగులు ఏడు సవర్ల బంగారు ఆభరణాలను లాక్కున్నారు. బాధితులు, ఇతర ప్రయాణికులు అప్రమత్తమై చైన్ లాగడంతో రైలు అక్కడికక్కడే నిలిచిపోయింది.రైలు ఆగడంతో 6గురు దొంగలు కిందికి దూకి, సమీపంలోని పొలాల మీదుగా బాపట్ల-గుంటూరు రోడ్డు వైపు పారిపోయేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో రైలులోనే ఎస్కార్ట్ విధుల్లో ఉన్న రైల్వే పోలీసులు తక్షణమే స్పందించి, పారిపోతున్న దుండగులపై 9 రౌండ్లు కాల్పులు జరిపారు.నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఓక అనుమానిత యువకుడిని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు. కేవలం 20 కిలోమీటర్ల పరిధిలోనే, గత రెండు నెలల వ్యవధిలో ఇలాంటి వరుస చోరీలు జరగడంగమనార్హం. గత ఏప్రిల్ 19, 2026: అప్పికట్ల సమీపంలో బెంగళూరు – నర్సాపూర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌లో నిద్రిస్తున్న మహిళలను లక్ష్యంగా చేసుకుని దొంగలు 130 గ్రాముల బంగారు ఆభరణాలను అపహరించారు.మూడు వారాల క్రితం బాపట్లకు సరిహద్దులో ఉన్న గుంటూరు జిల్లా నిడుబ్రోలు సమీపంలో దొంగలు ఏకంగా రైల్వే సిగ్నల్స్‌ను టాంపరింగ్ చేసి రైలును ఆపి, చోరీకి ప్రయత్నించారు. ఆ సమయంలోనూ రైల్వే పోలీసులు అప్రమత్తమై దాదాపు 6 రౌండ్లు కాల్పులు జరిపినప్పటికీ, దుండగులు తప్పించుకున్నారు.
