సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల దేశ వ్యాప్తంగా అలజడి చెలరేగుతున్న అంశం.. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజ్యాంగ విరుద్ధంగా ఎన్నికలు నిర్వహించారని, కేంద్రంలోని అధికార బీజేపీ కి అనుకూలంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలతో దాఖలైన పిటిషన్‌పై నేడు, సోమవారం సుప్రీం కోర్టు ఈసీకి నోటీసులు జారీ చేసింది. ఓటర్ల నమోదుకు ఉద్దేశించిన పారం-6 నిర్ణయాల రికార్డులను తనకు సమర్పించాలని ఆదేశించింది. ఫారం-6 సవరణలు, ఓటర్ల జాబితా సవరణ (SIR) నిర్ణయాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. ఈ అంశంపై నేడు సర్వోన్నత న్యాయస్థానం విచారణ ప్రారంభించింది.ఎన్నికల కమిషన్ నిర్ణయాలు ఏకగ్రీవంగా లేదా మెజారిటీతో మాత్రమే జరగాలని ఈ సందర్భంగా సీనియర్ అడ్వకేట్ వికాస్ సింగ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇద్దరు కమిషనర్ల ఆమోదం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమని వాదించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్ష నిర్ణయాలను రద్దు చేయాలని కోరారు. వికాస్ సింగ్ వాదనల అనంతరం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సీజేఐ ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఈసీ సమర్పించిన రికార్డులను పరిశీలిస్తామని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. ఫారం-6 మార్పులపై ఏకాభిప్రాయంతో నిర్ణయాలు కొన్నట్లు నిర్ధారణ అయితే వాటిని పక్కన పెట్టే అవకాశం పరిశీలిస్తామని కూడా సుప్రీం కోర్ట్ సంచలన ప్రకటన చేసింది.
