సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఢిల్లీ లో కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి, నితిన్ గడ్కరీ తో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ నేడు, గురువారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ లో పలు జాతీయ రహదారి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆగస్టు రెండో తేదీ శనివారం గడ్కరీ పాల్గొననున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని రెండు అత్యంత కీలకమైన జాతీయ రహదారుల నిర్మాణ ఆవశ్యకతను నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకువెళ్లారు. దిగమర్రు – ఆకివీడు – భీమవరం బైపాస్ రహదారి ఎన్ హెచ్–165, ఎన్ హెచ్–216లో భాగంగా నర్సాపురం బైపాస్ రహదారి (కత్తిపూడి–ఒంగోలు జాతీయ రహదారి) ప్రాధాన్యతను వివరించారు. వీటి నిర్మాణం పూర్తి అయితే భీమవరం పట్టణ ట్రాఫిక్ సమస్య తీరటంతోపాటు నర్సాపురం పట్టణంలో వాహనాల రద్దీ తగ్గుతుందని ఆయన వివరించారు. గత కొంతకాలంగా నిలిచిపోయిన నర్సాపురం బైపాస్ పనులను తక్షణమే పునఃప్రారంభించాల్సిన ఆవశ్యకతను కేంద్ర మంత్రి గడ్కరీకి తెలియజేశారు. జాతీయ రహదారుల నిర్మాణం జాప్యం స్థానిక ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తోందని, నిర్మాణ పనులు వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై గడ్కరీ తనకు హామీ ఇచ్చినట్లు శ్రీనివాస వర్మ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *