సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన అఖండ విజయంపై భీమవరంలో సంబరాలు మిన్నంటాయి. బెంగాల్‌లో బీజేపీ చారిత్రాత్మక విజయంతో పాటుతిరిగి అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఎన్డీయే (NDA) సుస్థిర పాలనకు ప్రజలు పట్టం కట్టడంపై కార్యకర్తల్లో నూతనోత్సాహం నెలకొంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ నేతృత్వంలో భీమవరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, టీడీపీ జిల్లా అధ్యక్షులు, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు, ఎన్డీయే కూటమికి చెందిన బీజేపీ, జనసేన, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బీజేపీ జిల్లా కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ ఓవర్ బ్రిడ్జ్, ప్రకాశం చౌక్ మీదుగా జువ్వలపాలెం రోడ్డులోని అడ్డ వంతెన వరకు ఉత్సాహంగా సాగింది. ప్రకాశం చౌక్ వద్ద కార్యకర్తలు టపాసులు కాల్చి, మిఠాయిలు పంచి సంబరాలు జరుపుకున్నారు. కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ కార్యకర్తలతో కలిసి కొద్దిసేపు డాన్స్ చేసి వారిలో ఉత్సాహాన్ని నింపారు. రాబోయే రోజుల్లో కేరళ, తమిళనాడులో కూడా బీజేపీ అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బైక్ ర్యాలీ అనంతరం బైపాస్ రోడ్ లోని మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజపేయి విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు.
