సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దక్షిణ భారతావని లో ఎండల తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ ఊరటనిచ్చే వార్త చెప్పింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. ప్రస్తుతం ఇవి ఆగ్నేయ అరేబియా సముద్రంతో పాటు లక్షద్వీప్, బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు విజయవంతంగా విస్తరించాయని భారత వాతావరణ శాఖ తాజగా ప్రకటించింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు జూన్ 1వ తేదీ నాటికి కేరళ తీరాన్ని తాకుతాయి, కానీ, ఈసారి ప్రస్తుత వాతావరణ పరిస్థితుల వల్ల ఈ ప్రవేశం కొద్దిగా ఆలస్యమవుతోందని, రానున్న కొన్ని రోజుల్లో ఇవి కేరళ తీరంలో అడుగుపెట్టేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. రుతుపవనాలు కేరళను తాకిన తర్వాత, అక్కడి నుండి దక్షిణాది మొత్తం విస్తరిస్తాయి. ఈ క్రమంలోనే కేరళలో ప్రవేశించిన మరో వారం రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలకు విస్తరిస్తాయని IMD స్పష్టం చేసింది అంటే కచ్చితంగా జూన్ 12వ తేదీలోగా ఏపీలో నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి
