సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక కార్యక్రమం “జనతా వారధి” లో నేడు శుక్రవారం భీమవరంలోని బిజెపి జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ హాజరయ్యారు. వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన ప్రజల నుంచి ఆయన స్వయంగా వినతులను స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డ్వాక్రా మహిళా ఐకెపి సెంటర్ల జీతాల బకాయిల విడుదల, ముత్యాలపల్లి హైస్కూల్ వద్ద జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు డివైడర్ల ఏర్పాటు, నరసాపురం ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఎదుర్కొంటున్న పాస్‌పోర్ట్ సమస్య తదితర అంశాలపై ప్రజలు కేంద్రమంత్రికి అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలపై శ్రీనివాస వర్మ తక్షణమే స్పందించి సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిష్కరించడం కోసమే భారతీయ జనతా పార్టీ ఈ “జనతా వారధి” కార్యక్రమాన్ని ప్రారంభించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనతా వారధి జిల్లా కన్వీనర్ తోట గంగరాజు, తదితర నేతలు పాల్గొన్నారు.
