సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠం గా భాసిల్లుతున్న తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ప్రతిరోజూ వేలాదిమంది , పర్వదినాలలో లక్షలాది భక్తులు వస్తుంటారు. అయితే తిరుపతిలో మరియు తిరుమలలో వేల మంది యాత్రికులకు వసతి కల్పించేలా 7600 గదులు, 5 పీఏసీలు ఉన్నాయి. ఒకవేళ తిరుమలలో వసతి గదులు దొరకకపోతే భక్తుల కోసం కొండ క్రింద తిరుపతిలో శ్రీనివాసం, మాధవం, విష్ణునివాసం, పద్మావతి అతిథి గృహం కల్పిస్తున్నాయి. అక్కడ కూడా వసతి గదులు సరిపోవడం లేదు.. ఈ సమస్యకు చెక్ పెట్టేలా తిరుపతి రైల్వే స్టేషన్ వెనుక గోవిందరాజస్వామి సత్రాల స్థానంలో కొత్తగా నిర్మిస్తున్న శ్రీపాదం, అచ్యుతం వసతి సముదాయాలు నిర్మాణ పనులు పూర్తీ చేసుకొని అతి త్వరలో అంటే బహుశా వచ్చే దసరా సమయంలో ప్రారంభం కానున్నాయి. జరగబోయే బ్రహ్మోత్సవాల సమయంలో వీటిని ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. శ్రీపాదం, అచ్యుతం వసతి సముదాయాలను దాదాపు రూ.600 కోట్ల వ్యయంతో, అధునాతన వసతులతో నిర్మిస్తున్నారు. ఈ శ్రీపాదం, అచ్యుత భవనాలు తొమ్మిది అంతస్తులతో నిర్మిస్తున్నారు. ఒక్కో భవనంలో 532 గదులు చొప్పున మొత్తం 1064 గదులు ఉంటాయి.. ఈ రెండు సముదాయాలలో కలిపి 10వేల మంది భక్తులకు వసతి కల్పించవచ్చు.ఇక్కడ కూడా రిసెప్షన్, అన్నదానం, డార్మెటరీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.. దాదాపు 7వేల మంది భక్తులకు సరిపోయేలా లాకర్ల సౌకర్యం కూడా అందుబాటు లోకి రానుంది.
