సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, గురువారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. గత 3 ఏళ్ళు పైగా పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం ప్రధాన కేంద్రంగా ఉందని, భీమవరం ఎంతో అభివృద్ధి చెందుతుందని, విద్య, వైద్య, ఆక్వా రంగాలలో శరవేగంగా ముందుకు సాగుతుందని, అయినప్పటికి అద్దె భవనాల్లో జిల్లా కలెక్టరేట్, రేకుల షెడ్డులో ఎస్పీ కార్యాలయాలు ఉన్నాయని, సుమారు 20 ఎకరాల్లో ఈ భవనాలను నిర్మిచాలన్నారు. గతంలో మార్కెట్ యార్డ్ లో కలెక్టరేట్ నిర్మించాలని 124 జీవో వచ్చిందని, అయితే కలెక్టరేట్ అనేది ఒక భవనం కాదని, ఒక సముదాయమని, ప్రజలకు అనువైన కార్యాలయమన్నారు. జిల్లా కేంద్రమైన భీమవరంలో అన్ని కార్యాలయాలు ఒకే కంపౌండ్ లో ఉండే విధంగా 20 ఎకరాల్లో ఒక కలెక్టరేట్ నిర్మించాలని, ఈ కలెక్టరేట్ ను ఏర్పాటు చేస్తే అన్ని సౌకర్యాలు సమకూరు తాయన్నారు. ఈ కలెక్టరేట్ నిర్మాణానికి సహకరించాలని సభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబుని కోరారు.. ఇటీవల భీమవరం లోనే ‘భీమా ఉడా’ ఏర్పాటు చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుందని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. అయితే ఏడాది క్రితం అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామా కృష్ణంరాజు అందరికి అందుబాటులో భీమవరం పట్టణం శివారు లో పెద్దమిరంలో జిల్లా కలెక్టరేట్ భవనం దాతల సహకారంతో స్వంత ఖర్చుతో శరవేగంగా నిర్మించి ఇస్తామని , పెదమిరంలో ఆ స్థలం భీమవరం పరిధిలోకి తెస్తానని ప్రకటించినప్పుడు .. ఎట్టి పరిస్థితులలో మార్కెట్ యార్డ్ లోనే కలెక్టరేట్ నిర్మించాలని స్థానికంగా పలు పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన జరిగింది. మరి ఎమ్మెల్యే అంజిబాబు ‘కొత్త ఆలోచన‘ ప్రకారం 20 ఎకరాలు స్థలం కావాలంటే భీమవరం పట్టణానికి ఎన్ని కిలోమీటర్లు దూరం అవతలకు వెళ్లాలో..?పట్టణం పరిధిలోనే స్థలం దొరికితే మంచిది.
