సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, ఆదివారం రాజమండ్రిలో పర్యటిస్తున్న ఆంధ్రప్రదేశ్ దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఏడాది జూన్ 26వ తేదీ నుంచి జరగనున్న గోదావరి పుష్కరాలకు పలు దేవాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని అన్ని దేవాలయాలను పున: నిర్మాణం చేస్తున్నామని పేర్కొన్నారు. గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయాలని అందుకోసం అధికారులతో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై ఇప్పటికే మూడు సమీక్ష సమావేశాలు జరిగాయని తెలిపారు. ఈరోజు గోదావరి పుష్కరాలకు సంబంధించి రాజమండ్రిలో రూ.9.55 కోట్ల పనులకు శంకుస్థాపనలు చేశామని అన్నారు. రాజమండ్రితోపాటు గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న అన్ని దేవాలయాలను గోదావరి పుష్కరాలకు అభివృద్ధి చేస్తామని అన్నారు. ఇప్పటికే ఉమ్మడి గోదావరి జిల్లాల వ్యాప్తంగా 43 దేవాలయాల పున: నిర్మాణం కోసం రూ.51 కోట్ల నిధులు మంజూరు చేశామని చెప్పారు.
