సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (పి.జి.ఆర్.ఎస్) కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి , ఐపీఎస్., “పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం” కార్యక్రమంలో భాగంగా ప్రజల నుండి వారి సమస్యలపై 19 అర్జీల స్వయంగా స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులనుద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ.., ప్రజలు ఎంతో నమ్మకంతో పోలీస్ శాఖను ఆశ్రయిస్తారని, వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉద్ఘాటించారు. స్వీకరించిన ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా కేవలం తాత్కాలిక ఉపశమనం కాకుండా, సమస్య మళ్లీ పునరావృతం కాకుండా చట్ట పరిధిలో శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. బాధితుల సమస్యను విన్న వెంటనే సంబంధిత స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో ఎస్పీ స్వయంగా ఫోన్లో మాట్లాడి, బాధితులకు సత్వర న్యాయం చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో భీమవరం సబ్ డివిజన్ డిఎస్పీ రఘువీర్ విష్ణు , జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కె.వి.వి.ఎన్ సత్యనారాయణ ఒన్ టౌన్ సీఐ నాగరాజు మరియు ఇతర కార్యాలయ పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు.
