సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (హెచ్‌ఏఎం) అభివృద్ధి పనులకు నేడు, మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు కుప్పం నుంచి వర్చువల్‌ గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాన్ని భీమవరంలోని ఆనంద్ ఇన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, కూటమి ప్రముఖులు నాయకులు పాల్గొని వీక్షించారు..ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు సహకారంతో భీమవరం పట్టణ అభివృద్ధికి రూ 43 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఈ నిధులతో సెంట్రల్ లైటింగ్, రహదారుల విస్తరణ, పార్కుల అభివృద్ధి, పారిశుద్ధ్య పనులు చేపడతామని, అన్నారు.. మున్సిపల్ ఎన్నికలు పూర్తయిన అనంతరం సుమారు రూ 100 కోట్ల అదనపు నిధులు వస్తాయని, వాటితో పట్టణ అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని ఎమ్మెల్యే అంజిబాబు అన్నారు. జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 123 పట్టణ స్థానిక సంస్థల్లో సుమారు రూ 7,469 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల అభివృద్ధికి సుమారు రూ 210 కోట్లు నిధులు కేటాయించినట్లు కలెక్టర్ తెలిపారు.. ప్రజా ప్రతినిధుల సమన్వయంతో ఈ అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *