సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అర్హులందరికీ సంక్షేమ పథకాలను అమలు చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. భీమవరం 8వ వార్డు కంకరదొడ్డి చినరంగనిపాలెం వద్ద నేడు, గురువారం లబ్దిదారులకు మంత్రి రవికుమార్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, కలెక్టర్ చదలవాడ నాగరాణి పింఛన్లు అందించారు. ఇంటింటికీ వెళ్లి పింఛన్ల పంపిణీతోపాటు ఉచిత బస్సు సౌకర్యం, గ్యాస్ సిలిండర్ పథకం, రేషన్ పంపిణీ, పారిశుద్ధ్యం, స్వయం సహాయక సంఘాల రుణాలు తదితర ప్రభుత్వ పధకాలు సక్రమంగా అమలు అవుతున్నాయా? లేదా? అడిగి తెలుసుకున్నారు. మంత్రి రవికుమార్ మాట్లాడుతూ.. జిల్లాలో 2.19 లక్షల మందికి రూ 98 కోట్ల మేర పింఛన్లు ప్రతినెల అందిస్తున్నామని, కొత్తగా దరఖాస్తు చేసుకున్న 45 వేల పింఛన్లకు సంబంధించి పరిశీలన పూర్తయి ప్రభుత్వానికి పంపినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే అర్హులైన వారికి పింఛన్లు అందించే చర్యలు చేపడతామన్నారు.
