సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల రాష్ట్రంలో కూటమి 2 ఏళ్ళు పాలన విజయోత్సవ సభలు జరుగుతుండగా దానికి పోటీగా ప్రతిపక్ష వైసీపీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ‘వెన్నుపోటు కు 2ఏళ్ళు’ అంటూ నిరసనలు ర్యాలీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహనరావుతో పాటు మరికొందరిపై నందిగామ పోలీసులు కేసు నమోదు చేశారు. నందిగామలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ అనే నినాదంతో దున్నపోతుతో వైసీపీ నేతలు ప్రదర్శన చేశారు. అది ర్యాలీలో పాల్గొని కంగారులో అదుపు తప్పి దూకుడుగా వ్యవహరించింది అని ఈ ఘటనపై తెలుగుదేశం పార్టీ నాయకులు నందిగామ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు, ప్రజల భద్రతకు భంగం కలిగించినట్లు పేర్కొంటూ వైసీపీ నేతలపై కేసు నమోదు చేశారు. ఈ నిరసనలో పాల్గొన్న దున్నపోతు కారణంగా ట్రాఫిక్ అంతరాయం కలగడంతో పాటు, ప్రజలు భయాందోళనకు గురయ్యారని తెలిపారు.ఈ రకంగా కేసులు పెడతారా? అంటూ స్థానిక వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
