సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: స్వామి వారి సేవలో ఉన్నామని కనీస ఇంగితజ్ఞానం లేకుండా గుడి అప్పగిస్తే శ్రీవారి కిరీటం తాకట్టు పెట్టేసారు ఆ ప్రబుద్ధులు. గుడివాడలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ఘరానా మోసం నేడు, బుధవారం వెలుగులోకి వచ్చింది. స్థానిక భక్తులు మాటూరి సుబ్బారావు, లక్ష్మీ కుమారి అనే వృద్ధ దంపతులు శ్రీవారిపై భక్తితో 461 గ్రాముల బంగారు కిరీటాన్ని చేయించి గతేడాది జనవరి నెల లో సమర్పించారు. అప్పట్లో దీని తయారీకి రూ.70 లక్షలు ఖర్చుచేయగా.. ప్రస్తుతం భారీగా పెరిగిన బంగారం ధర బట్టి రూ.కోటి ఫైనే ఉంటుంది. కానీ, ఈ కిరీటాన్ని ఆలయ ధర్మ కర్తల మండలి కమిటీ అధ్యక్షుడు మోహనరావు, మరికొంత మంది సభ్యులు కలిసి రూ. కోటి వరకు విలువచేసే ఆ కిరీటాన్ని కేవలం రూ. 38 లక్షలకు ఒక మార్వాడి కొట్టులో తాకట్టు పెట్టడం గమనార్హం. ఈ విషయం బయటకు పొక్కడంతో దాతలు విస్తుపోయారు. తీవ్ర ఆవేదనకు గురైన వృద్ధ దంపతులు.. గుడివాడ టూ టౌన్ పోలీసులకు దీనిపై ఫిర్యాదు చేశారు. రాజకీయాలకు అతితతంగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.
