సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: కర్నూలు జిల్లాలోని మంత్రాలయం వద్ద నేడు, ఆదివారం ఒక ఘోర విషాదం చోటుచేసుకుంది. పవిత్రమైన తుంగభద్ర నదిలో ఈతకు దిగిన ఐదుగురు యువకులు, యువతులు గల్లంతవడంతో వారి కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. బంధువుల ఇంట్లో నిర్వహించిన సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్న అనంతరం వీరంతా నదికి వెళ్లినట్లు సమాచారం. గల్లంతైన వారిలో సంధ్య (22), యువన్ చంద్ర (5), సతీష్ (35), రాఘవేంద్ర (25), ధను (23) ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పూజ కార్యక్రమం ముగిసిన తర్వాత సరదాగా ఈత కొట్టేందుకు నదిలోకి దిగిన వీరు, నీటి లోతును సరిగా అంచనా వేయలేక ప్రమాదానికి గురైనట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది.. సమాచారం అందుకున్న పోలీసులు, గజ ఈతగాళ్లు, మత్స్యకారులు సంఘటన స్థలానికి చేరుకుని విస్తృత గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ ప్రమాదంలో ఆదోనికి చెందిన అపర్ణ సురక్షితంగా బయటపడినట్లు, ఒకరి మృతదేహం లభ్యం అయినట్లు సమాచారం.
