సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తిరుమల శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్. తిరుమల శ్రీవారి దర్శనానికి టీటీడీ జారీ చేసే ఉచిత దర్శన టికెట్ల సమయాల్లో మార్పులు చేసింది. వేసవి సెలవులు పూర్తీ కావడంతో భక్తుల రద్దీ తగ్గింది. ఈనేపథ్యంలో మార్పులు చేసారు. స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్లను(ఎస్ఎస్డీ) ప్రతీ రోజూ తిరుపతిలో టీటీడీ జారీ చేస్తోంది. ఇప్పటి వరకు ఉదయం 5 గంటలకు వీటిని అందిస్తున్నారు. అయితే ఇక నుంచి మధ్యాహ్నం 1.30 గంటల నుంచి పంపిణీ చేయనున్నారు. నిన్న శుక్రవారం నుంచే ఈ సమయాల్లో మార్పులు చేశారు. శ్రీవారి దర్శనం కోసం భక్తులకు తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో ఎస్ఎస్డీ దర్శన టికెట్లను అందిస్తోంది. రైల్వే స్టేషన్ పక్కన ఉండే విష్ణునివాసం, బస్టాండ్ సమీపంలోని శ్రీనివాసం కాంప్లెక్స్, అలిపిరి మెట్ల దగ్గర ఉండే భూదేవి కాంప్లెక్స్‌లో ఈ టోకెట్లను అందిస్తున్నారు. రోజుకు 15 వేల టోకెన్ల వరకు జారీ చేస్తున్నారు. కాలినడకన శ్రీవారి దర్శనానికి వెళ్లేవారి కోసం మరో 2 వేల టోకెన్లను అందిస్తున్నారు. ఓరిజినల్ ఆధార్ లేదా ఆధార్ కార్డు జిరాక్స్ అందిస్తే మీ ఫొటో తీసుకుని ఈ దర్శనం టోకెన్ ఉచితంగా అందిస్తారు.
